ప్రధానిని గౌరవించలేని రాజకీయమా?
సోనియా–రాహుల్ భజన తప్ప దేశభక్తి లేదా?
విదేశీ సిద్ధాంత బానిసత్వానికి కూనంనేని మాటలే నిదర్శనం
మోదీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం
బీజేపీ జిల్లా నేత నెల్లూరి కోటేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్‌లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నేత నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ… దేశ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రధానిని గౌరవించలేని రాజకీయ ఆలోచన ప్రజాస్వామ్యానికి ప్రమాదమని మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భజన తప్ప దేశ గౌరవం తెలియని రాజకీయమే కూనంనేనిదని విమర్శించారు. విదేశీ సిద్ధాంతాలకు బానిసలై, పక్క పార్టీలకు సొత్తులా మారిన నేతలు దేశభక్తిపై మాట్లాడడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఒక ఎమ్మెల్యేగా, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి… దేశ ప్రధాని మీద వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు.
పేరు మార్పు కాదు… పేదల తలరాత మారే చట్టం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ – రోజ్‌గార్ ఔర్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)’ చట్టంపై ప్రతిపక్షాలు కావాలనే అపోహలు సృష్టిస్తున్నాయని నెల్లూరి ఆరోపించారు. పేరు మార్చారని మాత్రమే గగ్గోలు పెడుతున్నారని, కానీ ఇందులో దాగున్న పేదల భవిష్యత్తు మార్పును గుర్తించలేకపోతున్నారని విమర్శించారు. ఈ చట్టం ద్వారా ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచి పేదలకు మోదీ గ్యారెంటీ ఇచ్చారని గుర్తుచేశారు. గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు ఢిల్లీ నుంచి వస్తున్నాయన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని, గ్రామ సభలు–పంచాయతీలే తమ అవసరాలను నిర్ణయించే పూర్తి స్వేచ్ఛను ఈ చట్టం కల్పించిందని స్పష్టం చేశారు.
రైతులు–కూలీల సమతుల్యతకు కేంద్ర నిర్ణయాలు
వ్యవసాయ సీజన్లలో కూలీల కొరత రైతులను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించిందని తెలిపారు. అందుకే విత్తనాలు నాటే సమయంలో లేదా కోతల కాలంలో ఏడాదికి 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేసే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చిందన్నారు. దీని వల్ల రైతులు, కూలీల మధ్య సమతుల్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే ఉపాధి హామీ పథకానికి వెన్నెముకగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహణ వ్యయాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచినట్లు వెల్లడించారు. దీని ద్వారా వారికి సకాలంలో వేతనాలు, మెరుగైన శిక్షణ లభిస్తుందని తెలిపారు.
క్షమాపణ చెప్పకపోతే సహించేది లేదు
గ్రామాల్లో మౌలిక వసతులు, మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని నెల్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలో పని కల్పించకపోతే నిరుద్యోగ భత్యం, వేతనాల ఆలస్యానికి పరిహారం వంటి నిబంధనలను బలోపేతం చేసిన విషయాన్ని కూనంనేని తెలుసుకోవాలని సూచించారు. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రధాని నరేంద్ర మోదీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఉద్యమాలను ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నాయకులు సుదర్శన్ మిశ్రా, బండారు నరేష్, వీరవల్లి రాజేష్, నెల్లూరు బెనర్జీ, రవి రాథోడ్, రవి గౌడ్, గడిల నరేష్, కోట మూర్తి, అల్లిక అంజయ్య, మనీ, వంశీ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


