వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
శాశ్వత స్పోర్ట్స్ పాఠశాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
అసెంబ్లీలో డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియం, శాశ్వత రెసిడెన్షియల్ క్రీడా పాఠశాల నిర్మాణ పనులను తక్షణమే వేగవంతం చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన కీలకంగా ప్రస్తావించారు. అసెంబ్లీలో మాట్లాడిన కడియం శ్రీహరి మాట్లాడుతూ… వరంగల్ జిల్లా విద్యా కేంద్రంగానే కాకుండా క్రీడా కేంద్రంగా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలంతా కలిసి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం, శాశ్వత రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఆరు నెలలు గడిచినా పురోగతి లేదు
సీఎం హామీ ఇచ్చి ఇప్పటికే ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు స్థల గుర్తింపు, నిర్మాణ పనుల ప్రారంభంలో స్పష్టమైన పురోగతి కనిపించడం లేదని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. కావున సంబంధిత శాఖ మంత్రి, జిల్లా మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వెంటనే చొరవ తీసుకుని వరంగల్‌లో శాశ్వత స్పోర్ట్స్ పాఠశాల నిర్మాణంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాల క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలంటే ఆధునిక స్పోర్ట్స్ మౌలిక వసతులు అత్యంత అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుతో వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, దీనివల్ల స్థానిక యువతకు క్రీడల్లో రాణించే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరిగి, వరంగల్ ప్రాంతీయంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకుని, స్థలాన్ని గుర్తించి పనులు ప్రారంభించాలని ఆయన అసెంబ్లీలో గట్టిగా కోరారు.


