నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు
సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుషాల్కర్
కాకతీయ,చేర్యాల: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అవసరమని సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుషాల్కర్ సూచించారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలోని పలు కాలనిలల్లో ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేయగా చేర్యాల సీఐ బానోతు రమేష్ నాయక్, ఎస్సై జి.అపూర్వ రెడ్డితో కలిసి సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుషాల్కర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుషాల్కర్ మాట్లాడారు.సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో చోరీలు, గొడవలు, రోడ్డు ప్రమాదాల వంటి ఘటనల్లో నిందితుల కదలికలను గమనించి కేసులను త్వరగా ఛేదించవచ్చన్నారు. ఈ కెమెరాలు నేరాలపై పర్యవేక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని,ప్రజల భద్రతకు ఇది ఒక నూతన అడుగు లాంటిదన్నారు. ప్రస్తుతం మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు మహిళల రక్షణకు ఒక శక్తివంతమైన ఆయుధంలా పనిచేస్తాయని తెలిపారు. రోడ్డుప్రమాదాలను తగ్గించడంలో కూడా ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి.

కెమెరాలు ఉండటంతో నేరస్తుల్లో భయం, ప్రజల్లో భద్రత పట్ల భరోసా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం, మండల కేంద్రంలో కూడా సీసీ నెట్‌వర్క్‌ను విస్తరించాలన్నది తమ లక్ష్యం అని పేర్కొన్నారు.ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి పట్టణం, ప్రతి గ్రామం సీసీ కెమెరాలతో నిండినప్పుడే పోలీసింగ్ మరింత సమర్థవంతంగా మారుతుందన్నారు. సీసీ కెమెరాలు లేని టైంలో కేసుల ఛేదన కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు వాటి సాయంతో విచారణ వేగంగా జరుగుతోందన్నారు.పోతిరెడ్డిపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకారం అందించిన గ్రామ ప్రజలకు, పాలకమండలి సభ్యులను అభినందించారు. అంతకు ముందు అడిషనల్ డీసీపీ కుషాల్కర్ కు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమేష్ నాయక్ , ఎస్‌ఐ అపూర్వ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్ ఎడబోయిన కుమార్,ఉప సర్పంచ్ పోలోజు రాజబాబు,గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు ఉన్నారు.


