కాకతీయ, స్పోర్ట్స్: భారత ఐటీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ మరోసారి తన షేర్ హోల్డర్లకు భారీ గిఫ్ట్ ఇవ్వబోతోంది. కంపెనీ ఇప్పటివరకు ఎప్పుడూ చేయని రీతిలో రూ. 18,000 కోట్ల విలువైన షేర్ బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించింది. అయితే ఆశ్చర్యకరంగా కంపెనీ ఫౌండర్స్, ముఖ్య ప్రమోటర్లు ఈ బైబ్యాక్‌లో పాల్గొనకూడదని నిర్ణయించారు. సంస్థ యొక్క ప్రమోటర్ మరియు ప్రమోటర్ గ్రూప్ సభ్యులు టెండర్ ఆఫర్ రూపంలో జరగబోయే ఈ షేర్ బైబ్యాక్‌లో పాల్గొనరని 2025 అక్టోబర్ 22న ఇన్ఫోసిస్ అధికారికంగా వెల్లడించింది.
ఈ జాబితాలో ఎన్.ఆర్. నారాయణమూర్తి, సుధా మూర్తి, నందన్ నీలేకని, అలాగే వారి కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని వారు 2025 సెప్టెంబర్ 14 నుంచి 19 మధ్య తేదీలలో పంపిన లేఖల ద్వారా సంస్థకు తెలియజేశారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో ప్రమోటర్లు మరియు వారి కుటుంబాల కలిపి వాటా 13.05% గా ఉంది. ఇందులో మూర్తి, నీలేకని, గోపాలకృష్ణన్, దినేష్, శిబులాల్ కుటుంబాలు ఉన్నాయి. మొత్తం వారు 54,20,29,249 షేర్లు కలిగి ఉన్నారు.
ప్రధాన ప్రమోటర్ల షేర్ వివరాలు
– సుధా గోపాలకృష్ణన్ : 9,53,57,000 షేర్లు (2.3%)
– రోహన్ మూర్తి : 6,08,12,892 షేర్లు (1.46%)
– నందన్ నీలేకని : 4,07,83,162 షేర్లు (0.98%)
– నారాయణ మూర్తి : 1,51,45,638 షేర్లు (0.36%)
బైబ్యాక్‌పై ఇన్వెస్టర్ల దృష్టి
ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ ఐటీ సంస్థ ఇంత పెద్ద స్థాయిలో బైబ్యాక్ ప్రకటించడం స్టాక్ మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. అయితే వ్యవస్థాపకులు ఇందులో పాల్గొనకపోవడం వెనుక కారణాలపై వివిధ రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. కొందరు దీన్ని దీర్ఘకాల పెట్టుబడిపై నమ్మకం సూచనగా చూస్తుండగా, మరికొందరు వారి వాటా స్థిరంగా ఉంచే వ్యూహంగా భావిస్తున్నారు.
ఇన్ఫోసిస్ బైబ్యాక్‌ల చరిత్ర
ఇది ఇన్ఫోసిస్ చరిత్రలో ఐదవ షేర్ బైబ్యాక్. 2017లో మొదటి బైబ్యాక్ రూ. 13,000 కోట్లు, ఒక్కో షేర్‌కు రూ. 1,150. తర్వాత 2019, 2021, 2022లో వరుసగా రూ. 8,260 కోట్లు, రూ. 9,200 కోట్లు, రూ. 9,300 కోట్ల బైబ్యాక్‌లు నిర్వహించింది. ఈ బైబ్యాక్‌లు సంస్థకు ఈపీఎస్ పెరగడంలో, అలాగే షేర్ హోల్డర్లకు మెరుగైన క్యాపిటల్ రిటర్న్ అందించడంలో సహాయపడ్డాయి. ఇక ఇప్పుడు రూ.18,000 కోట్ల బైబ్యాక్‌తో పెట్టుబడిదారులకు ఇన్ఫోసిస్ మరోసారి లాభదాయకమైన అవకాశం ఇవ్వబోతోంది. అయితే ఫౌండర్లు దూరంగా నిలవడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటన్నది మాత్రం స్టాక్ మార్కెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.


