ఇండిగో కష్టాలు.. ప్రయాణికులకు అగచాట్లు
శంషాబాద్‌లో టైమ్ అయిందంటూ గేట్ క్లోజ్
కాకతీయ, శంషాబాద్ : ఇండిగో విమానయాన సంస్థ వైఖరి విమాన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తాజాగా చోటుచేసుకున్న ఘటన ప్రయాణికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. టికెట్లు తీసుకుని ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లేందుకు లైన్‌లో నిలబడ్డ ప్రయాణికులను ఇండిగో సిబ్బంది ‘సమయం అయిపోయింది’ అంటూ లోపలికి అనుమతించలేదు. కొంతమందిని మాత్రమే లోపలికి పంపిన అనంతరం గేట్‌ను అకస్మాత్తుగా మూసివేయడంతో పలువురు ప్రయాణికులు అవాక్కయ్యారు. ఈ విషయమై ప్రశ్నించగా, సమయం దాటిపోయిందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని ఇండిగో సిబ్బంది సమాధానం ఇచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు. టికెట్లు తీసుకుని, క్యూలో నిలబడి ఉన్నప్పటికీ గేట్‌ను మూసివేయడమేంటని వారు నిలదీశారు. అయితే ఎంతగా వాదించినా సిబ్బంది సరైన సమాధానం చెప్పకుండా, తామేమీ చేయలేమని, ఏదైనా అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించినట్లు తెలిపారు. దీంతో పలువురు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇండిగో సంస్థ నిర్లక్ష్య వైఖరిపై చర్యలు తీసుకోవాలని, ప్రయాణికుల సమయానికి, డబ్బులకు విలువ ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


