కారేపల్లిలో అక్రమ మద్యం గుట్టురట్టు
అధికారుల అండతోనే దందా?
ఆటోల్లో రూ.2.5 లక్షల విలువైన మద్యం పట్టివేత
‘110 కనకదుర్గ వైన్ షాప్’కు చెందిన నిల్వలుగా గుర్తింపు
ఎక్సైజ్ అధికారుల గోప్యతపై అనుమానాలు
గతంలోనూ ఇదే తరహా ఘటనలపై ఆరోపణలు
ఏజెన్సీ గ్రామాలకు అక్రమ రవాణాపై గ్రామస్థుల ఆగ్రహం
సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి
కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండల కేంద్రంలో అక్రమ మద్యం దందా వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది. సోమవారం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2.5 లక్షల విలువైన మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎక్సైజ్ అధికారుల వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతూ వివాదానికి దారితీస్తోంది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎక్సైజ్ అధికారులు కారేపల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోల్లో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం నిల్వలు కారేపల్లిలోని ‘110 కనకదుర్గ వైన్ షాప్’కు చెందినవిగా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. పట్టుబడిన మద్యాన్ని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
అధికారుల మౌనం… అనుమానాలకు తావు
సాధారణంగా భారీ స్థాయిలో అక్రమ మద్యం పట్టుబడినప్పుడు పూర్తి వివరాలను వెల్లడించాల్సిన ఎక్సైజ్ అధికారులు ఈ ఘటనలో గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుల వివరాలు, కేసు నమోదు అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో అధికారులపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు అక్రమార్కులకు అండగా ఉంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల బస్వాపూర్ ప్రాంతంలో కూడా ఆటోలో అక్రమ మద్యం పట్టుబడిన ఘటనలో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని తిరిగి సంబంధిత వైన్ షాప్‌కు అప్పగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బస్టాండ్ సెంటర్‌లోని వైన్ షాప్ యజమాని నిబంధనలకు విరుద్ధంగా ఆటోల ద్వారా ఏజెన్సీ గ్రామాలకు మద్యం తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా మద్యం సరఫరా చేయడం వల్ల గ్రామాల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ దందా నిర్బంధం లేకుండా కొనసాగుతోందని విమర్శిస్తున్నారు.
కలెక్టర్ జోక్యం కోరుతున్న స్థానికులు
ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం, అక్రమ మద్యం రవాణాలో అధికారుల ప్రమేయంపై జిల్లా కలెక్టర్ స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ మద్యం సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఈ దందాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


