లెక్క తప్పితే పదవి గల్లంతే!
ఎన్నికల వ్యయంలో ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే
పంచాయతీ కార్యదర్శుల కఠిన ఆదేశాలు
ఆయోమయంలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఆనందం ఇంకా చల్లారకముందే నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు అసలు పరీక్ష మొదలైంది. ఎన్నికల్లో పెట్టిన ఖర్చులపై ఖచ్చితమైన లెక్కలు సమర్పించాల్సిందేనని పంచాయతీ కార్యదర్శులు గడువు విధించడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. లెక్కలు తప్పితే గెలుపు చెల్లదని పంచాయతీరాజ్ చట్టం–2018 స్పష్టం చేస్తోంది. పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 23 ప్రకారం ఎన్నికల ఖర్చుల్లో తేడాలు ఉన్నట్లయితే గెలిచిన అభ్యర్థుల పదవి రద్దుతో పాటు రానున్న మూడు సంవత్సరాల పాటు ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేసే అర్హత కోల్పోవాల్సి వస్తుంది. ఈ నిబంధనలు కటువుగా అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేయడంతో అభ్యర్థులు ఖర్చుల నివేదికలు సిద్ధం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలోని అనేక గ్రామపంచాయతీల్లో త్రిముఖ పార్టీల పోటీ నడవడంతో గెలుపుకోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఖర్చులన్నింటికీ సరైన ఆధారాలతో లెక్కలు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గడువు ముందుగానే.. అభ్యర్థుల్లో కలవరం..!
గత ఎన్నికల్లో 45 రోజుల గడువు ఉండగా, ఈసారి ముందుగానే ఖర్చుల లెక్కలు సమర్పించాలని ఆదేశాలు రావడంతో సర్పంచులు, వార్డు సభ్యులు అయోమయంలో పడుతున్నారు. గుర్తులు కేటాయించిన నాటి నుంచే చేసిన ప్రతి ఖర్చుకూ రసీదులు చూపాల్సి ఉంటుంది. ఇప్పటికే గ్రామ కార్యదర్శులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. భద్రాద్రి జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం వందలాది గ్రామాల్లో పోటీ తీవ్రంగా సాగింది. ఈ నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులు ఖర్చుల సర్దుబాటుపై తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.
ఖర్చు పరిమితులు ఇవే..!
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఐదువేల జనాభా లోపు గ్రామపంచాయతీల్లో సర్పంచ్ గరిష్టంగా రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేల వరకు మాత్రమే ఖర్చు చేయాలి. ఐదువేల పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచులకు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యులకు రూ.50 వేలే పరిమితి. ఈ పరిమితిని మించి ఖర్చు చేసినట్లు తేలితే చర్యలు తప్పవు. అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను సంబంధిత ఎంపీడీవోలకు సమర్పించి రసీదు పొందాలి. అనంతరం ఫిబ్రవరి 15లోగా టి–పోల్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి మండలానికి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తంగా చూస్తే.. గెలుపు తర్వాత అసలైన సవాల్ మొదలైందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. లెక్క తప్పితే పదవి గల్లంతేనన్న హెచ్చరికతో గ్రామ రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.


