కొండగట్టు ఆలయ భూముల జోలికి వస్తే ఊరుకోం
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరిక
కాకతీయ, కొండగట్టు :కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ భూముల పరిరక్షణకు బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు గుట్టపై అటవీ శాఖ అధికారులు హద్దులు నిర్ణయించిన నేపథ్యంలో బుధవారం ఆయన కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీతారామ చంద్రస్వామి ఆలయం, బేతాళ స్వామి ఆలయాలను పరిశీలించిన అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి అటవీ శాఖ చర్యలపై ఆరా తీశారు.
భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు
ఆలయం వద్ద మీడియాతో మాట్లాడిన సుంకె రవిశంకర్, అంజన్న స్వామి భూముల జోలికి వస్తే భక్తుల ఆగ్రహాన్ని తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తరతరాలుగా భక్తుల విశ్వాసంతో, సంప్రదాయాలతో కొనసాగుతున్న ఆలయ భూములపై అటవీ శాఖ హద్దులు విధించడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. రెండు శాఖలకు మంత్రి అయిన కొండా సురేఖ స్వయంగా కొండగట్టు వచ్చి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు.
ఆందోళనలకు వెనుకాడం
అంజన్న స్వామి భూములను కాపాడుకునేందుకు భక్తులతో కలిసి అవసరమైతే ఉద్యమాలు, ఆందోళనలు చేపడతామని సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఆలయ భూముల విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అంజనేయస్వామి ఆలయం కోట్లాది భక్తుల విశ్వాస కేంద్రమని, ఇలాంటి పవిత్ర స్థలాల విషయంలో అధికారులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.


