కేసీఆర్ జోలికొస్తే అగ్గిపుట్టిస్తాం
మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్
నిరసనలతో హోరెత్తిన మధిర నియోజకవర్గం
రాజకీయ దురుద్దేశంతోనే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు
రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు, బైక్ ర్యాలీ
కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పిలుపు
కాకతీయ, బోనకల్ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కి సిట్ నోటీసుల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు, అరాచక చర్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో లింగాల కమల్ రాజు నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అబద్ధాల పునాదులపై గద్దెనెక్కిన కాంగ్రెస్కు హామీలను అమలు చేయడం చేతకాక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై, ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ అనే లొట్టపీసు కేసులో రాజకీయ కక్షతోనే విచారణ పేరిట డ్రామాలు ఆడుతున్నదని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్
రాజకీయ దురుద్దేశంతోనే ఫోన్ ట్యాపింగ్ కేసు ను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయని అన్నారు. కేసీఆర్ లక్ష్యంగా సిట్ అధికారుల తీరు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్నారు.
రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించిన మహానేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. విచారణకు అంగీకరిస్తానని చెప్పినా కూడా కేసీఆర్ ఇంటి గేటుపై అర్ధరాత్రి సిట్ అధికారులు పోస్టర్ ను అంటించడం రేవంత్ సర్కార్ కుట్రలో భాగమేనని అన్నారు. రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ను తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ పై రేవంత్ సర్కార్ రాజకీయ కుట్ర పన్నిందన్నారు. రేవంత్ తీరును, అనుసరిస్తున్న విధానాలను యావత్ తెలంగాణ సమాజం గమనిస్తోందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు నమోదు చేసి ఓటుతోనే రేవంత్ సర్కార్ కు బుద్ధి చెప్పాలని భాస్కర్ రావు కోరారు. కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని ఆకాంక్షించారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు


