ఆదర్శనేత గుమ్మడి నర్సయ్య
రాజకీయాలకే వన్నె తెచ్చిన ఆదర్శప్రాయుడు
ఆయన జీవితాన్ని సినిమాగా తీసుకురావడం గర్వకారణం
శివ రాజ్ కుమార్‌కు అభినందనలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
పాల్వంచలో గుమ్మడి నర్సయ్య సినిమా ప్రారంభోత్సవం
కాకతీయ, తెలంగాణ బ్యూరో / కొత్తగూడెం : అందరికీ ఆదర్శప్రాయుడు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితాన్ని సినిమాగా తీసే ప్రయత్నం చాలా గొప్పదని.. వారి చరిత్ర తెలంగాణ సరిహద్దులు దాటి యావత్ భారత దేశంలో సినిమాగా రావటం… తెలంగాణ బిడ్డలుగా మనం గర్వించదగ్గ విషయం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవ వేడుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవినీతి రహిత, మానవత విలువలను కాపాడుతూ ప్రజలకు ఎలా సేవలు చేయాలో తెలుసుకోవాలంటే గుమ్మడి నర్సయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మాట్లాడుతాం అన్నారు. నిస్వార్థం, నిరాడంబరతకు ఆయన నిలువుటద్దం అని, రాజకీయాల్లో మచ్చలేని ఆయన వ్యక్తిత్వం మహోన్నతమైందని కొనియాడారు.
డైరెక్టర్ పరమేష్ కామారెడ్డి బిడ్డనే…
డైరెక్టర్ పరమేష్ తమ్ముడు మన కామారెడ్డి బిడ్డనే. గుమ్మడి నర్సయ్య లాంటి గొప్ప వ్యక్తి సినిమా తీసున్నాం. ఆ కార్యక్రమానికి రావాలని నన్ను కోరారు. మేము జాగృతి జనం బాటలో బిజీగా ఉన్నప్పటికీ సమయం తీసుకోని ఇక్కడకు రావటం జరిగింది. గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తి మన తెలంగాణ బిడ్డ అని తలుచుకుంటేనే గర్వంగా ఉంది. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ఈ సినిమాను ప్రోత్సహించటం అభినందించాల్సిన విషయం. కానీ తమిళనాడు, మళయాళం, హిందీలో రాయితీ ఇవ్వలేదని చెబుతున్నారు. ఇప్పటికి కూడా సౌత్ ఇండియన్, తెలుగు సినిమా మీద ఉన్న చులకన భావాన్ని ఇది చూపిస్తోంది. ఇప్పటికైనా సరే సినిమా పెద్దలు, ముఖ్యంగా దిల్ రాజు మిగతా భాషల్లో కూడా ఈ సినిమాకు రాయితీలు ఇప్పించేందుకు ప్రయత్నించాలి. మనమందరం గర్వించే ఈ సినిమాను ఒక పెద్ద సినిమాగానే భావించాలని కోరుతున్నా.
సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యం
ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో తీస్తుండటం మనస్ఫూర్తిగా అభినందించే విషయం. సినిమాలో ప్రధాన పాత్రను పోషించేందుకు శివ రాజ్ కుమార్ అంగీకరించటం ద్వారా సినిమాకు వన్నె వచ్చింది. ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎంతో మంది యువకులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఈ సినిమా స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నా. ఖమ్మంలో పాల్వంచలో 1969, 2001 నాటి తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. కానీ వారందరికీ కూడా లభించాల్సిన ఆదరణ, రాజకీయ అవకాశాలు, ఆర్థిక స్వావలంభన, గౌరవం దక్కలేదు. వారికి అవన్నీ కూడా దక్కే వరకు పోరాటం చేస్తామని జనంబాట ప్రారంభంలోనే చెప్పాం. ఇక ముందు కూడా అదే విధంగా పోరాటం చేస్తాం. సబ్బండ వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం లభించాలంటే సామాజిక తెలంగాణ అవసరం. ఈ పోరాటం లో ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, అధికారానికి దూరంగా ఉన్న వర్గాలను కలుపుకొని పోతాం. ముఖ్యంగా అధికారానికి దూరంగా ఉన్న మా మహిళలను కలుపుకొని సామాజిక తెలంగాణ సాధిస్తాం… అని కవిత అన్నారు.


