కాంగ్రెస్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి
ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు, మెట్రోను తీసుకొచ్చాం
రాజధాని మునిగిపోతే కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వలేదు
బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది శూన్యం
ఎల్ అండ్‌టీ నష్టాలకు కూడా ఆ పార్టీదే బాధ్యత
కిషన్‌రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ ..
మెట్రో విస్తరణకు రూ.43వేల కోట్లతో ప్రణాళికలు
రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం.
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కేంద్ర, రాష్ట్రంలో 2004-2014 మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భాగ్యనగరం ఎక్కువగా అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓఆర్‌ఆర్ (ఔటర్ రింగురోడ్డు), శంషాబాద్ ఎయిర్‌పోర్టు, మెట్రో రైలు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
హైదరాబాద్ మునిగిపోతే చిల్లిగవ్వ కూడా కేంద్రం ఇవ్వలేదు : 2014 నుంచి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది శూన్యమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆక్షేపించారు. 2014లో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న ఆయన 2023లో కేసీఆర్ తెలంగాణను రూ.8లక్షల కోట్ల అప్పుల్లో పెట్టి మళ్లీ కాంగ్రెస్‌కు అప్పగించారని ఆరోపించారు.
ఐటీఐఆర్‌ను రద్దు చేసింది ఎవరు?
హైదరాబాద్‌కు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్‌ను రద్దు చేసింది ఎవరు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఐటీఐఆర్ కూడా మంజూరు చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఉండేదన్నారు. వరదలు వచ్చి హైదరాబాద్ ముగినిపోతే కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి వరద సాయంగా రూపాయి కూడా తేలేదని ధ్వజమెత్తారు. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? : బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతి భవన్ నిర్మించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కుమారుడిని సీఎంను చేయాలని, వాస్తు సరిగా లేదని బాగున్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది నిర్మించారని ఆరోపించారు. పేద ప్రజలకు ఆ సచివాలయం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అని ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? ప్రతిపక్షాలు, మీడియా ప్రతినిధులపై నిఘా పెట్టేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారని ఆక్షేపించారు.
శశిధర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్
ఎవరికీ అనుమతి లేని విలాసవంతమైన భవనాలు మాత్రమే నిర్మించారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతు కోసమని కట్టిన కాళేశ్వరం మాత్రం మూడేళ్లకే కూలిందని మండిపడ్డారు. పదేళ్లలో మెట్రో రైలును కొత్తగా కిలోమీటరు కూడా పొడిగించలేదన్న ఆయన మంజూరైన పాతబస్తీ మెట్రోను కూడా పక్కకు పెట్టారని విమర్శించారు. మెట్రో నిర్మించిన ఎల్ అండ్‌టీ నష్టాలకు కూడా భారత రాష్ట్ర సమితే కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు కావస్తోంది. భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండాలనే దానిపై విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మెట్రో విస్తరణకు రూ.43వేల కోట్లతో ప్రణాళికలు కేంద్రానికి ఇచ్చాం. ఆనాడు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కొట్లాడిన శశిధర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనే వాళ్లు. నేడు హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్‌రెడ్డి, కేటీఆర్‌లను బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారు. వీరిద్దరూ కలిసి మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్‌సిటీని అడ్డుకుంటున్నారు. గోదావరి జలాలు 20 టీఎంసీలు హైదరాబాద్‌కు తేవాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
అడ్డంకులు సృష్టిస్తున్నారు
హైదరాబాద్ నగరంలో నిర్మించాలనుకున్న పైవంతెనలు, అండర్ పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 30 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కంటోన్మెంట్ నుంచి శామీర్‌పేట, మేడ్చల్‌కు ఎలివేటెడ్ కారిడార్లకు అప్రూవల్ తెచ్చి రూ.5,000 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. ఉత్తర తెలంగాణ మొత్తం ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లపైనే ఆధారపడి ఉందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వాటి అనుమతులకు ప్రయత్నం చేయలేదని విమర్శించారు. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చామన్నారు. అదనంగా కొత్తగూడెం, రామగుండం విమానాశ్రయాలకు ప్రయత్నాలు చేస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
కబ్జాలపైనా రాజకీయం చేస్తున్నారు
‘కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత మొదటి ఆరు నెలలు సార్వత్రిక ఎన్నికలతో గడిచిపోయాయి. ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లో పనిచేసింది ఏడాదిన్నర మాత్రమే. ఏడాదిన్నరలోనే రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. రూ.లక్ష కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్‌ఆర్‌ను(ఔటర్ రింగురోడ్డు) కేవలం రూ.7వేల కోట్లకు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అమ్ముకుంది. చెరువుల్లోని కబ్జాలను తొలగించి పునరుద్ధరిస్తే దానిపై రాజకీయం చేస్తున్నారు. ప్రజలను ఓటు అడుగుతున్నా మీ ఓటు ద్వారా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం’ అని రేవంత్ రెడ్డి అన్నారు.


