వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య
ట్రాక్టర్‌తో ఢీకొట్టి మట్టుబెట్టిన భార్య–ప్రియుడు
కాకతీయ, వికారాబాద్ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన సంచలన ఘటన వికారాబాద్ జిల్లా చోడాపూర్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. ఈ కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గ్రామానికి చెందిన కర్రె రత్నయ్య (32) తన భార్య కవిత, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడితో కలిసి నివసిస్తూ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కవిత ప్రైవేట్ కంపెనీలో కూలీగా పని చేస్తోంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణతో కవితకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రత్నయ్య పెళ్లీడుకొచ్చిన కూతుర్లు ఉన్నారని, కుటుంబ గౌరవాన్ని కాపాడాలని భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయితే ఇవే హెచ్చరికలు తమ అక్రమ సంబంధానికి అడ్డుగా మారుతున్నాయని భావించిన కవిత, ప్రియుడు రామకృష్ణతో కలిసి భర్తను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్లాన్ ప్రకారం, రత్నయ్య ఎప్పటిలాగే పొలం పనుల కోసం వెళ్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్‌తో ఢీకొట్టి రామకృష్ణ అతడిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కవిత పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చింది. అయితే రత్నయ్య తమ్ముడు దేవయ్య అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా, భార్య–ప్రియుడు కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో కవిత, రామకృష్ణలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదంతో పాటు కలకలం రేపింది.


