పెట్రోల్ పోసి భార్యను హతమార్చిన భర్త
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లిలో శనివారం చోటుచేసుకున్న భార్య హత్య కేసు స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. భూ వివాదం చుట్టూ తిరిగిన కుటుంబ కలహాలు చివరకు ప్రాణాంతకంగా మారాయి.సుకృత,మహిపాల్ రెడ్డి దంపతులు 26 ఏళ్లుగా వైవాహిక జీవితం కొనసాగించగా, వారికి ఒక కూతురు ఉంది. ఇటీవల తమ కూతురి వివాహం జరిపిన సుకృత, కుటుంబ ఆస్తిలో కొంతభాగాన్ని ఆమె పేరున నమోదు చేయడంతో పరిస్థితులు విషమించాయి. ఇదే సమయంలో మహిపాల్ మరో మహిళతో వివాహం చేసుకుని ఆమెతో జీవించడం కుటుంబంలో ఉద్రిక్తతలను మరింత పెంచిందని గ్రామస్థులు చెబుతున్నారు.శనివారం ఉదయం సుకృత పొలం వద్దకు వెళ్లిన సమయంలో మహిపాల్ అక్కడికి చేరుకుని మాటామాటా పెరిగి దారుణానికి దారితీసింది. కోపంతో ఊగిపోయిన మహిపాల్ సుకృతపై పెట్రోల్ పోసి నిప్పంటించగా, ఆమె ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణం గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.


