- పట్టుబడిన ప్యాకెట్ల విలువ రూ.2.50 కోట్లు
- గంజాయి ప్యాకెట్లు, కంటైనర్, రెండు ఫోన్లు స్వాధీనం
- పోలీసులను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: సులువుగా డబ్బు సంపాదించాలనే కొందరు సిండికేట్గా మారి మాఫియా పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే కోవాకు చెందిన ఒక ముఠా నిషేధిత గంజాయి రవాణా చేస్తూ అడ్డంగా దొరికిన సంఘటన జిల్లాలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో భారీ గంజాయి పోలీసులకు పట్టుబడింది. మహారాష్ట్ర, కర్ణాటక చెందిన ఇద్దరు వ్యక్తులు లారీ కంటైనర్లో గంజాయిని భద్రాచలం నుండి కొత్తగూడెం ఖమ్మం మీదుగా రాజస్థాన్లోని జైపూర్ కు అక్రమ రవాణా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం సిసిఎస్ పోలీసులు, సుజాతనగర్ ఎస్సై రమాదేవి తన సిబ్బందితో కలిసి సంయుక్తంగా సుజాతనగర్ మండలం వేపలగడ్డ గ్రామంలో ఉన్న అన్నపూర్ణ బేకరీ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఓ లారీ కంటైనర్ కొత్తగూడెం నుండి ఖమ్మం వైపుగా వస్తుండగా అనుమానం వచ్చి పోలీసులు ఆపారు. కంటైనర్ ను తనిఖీ చేయగా అందులో 96 ప్రభుత్వ నిషేదిత గంజాయి ప్యాకెట్లను గుర్తించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ కంటైనర్ లో 96 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకోగా 499 కేజీలు గంజాయి ఉన్నట్లుగా తేలిందన్నారు. దీని విలువ సుమారుగా రూ.2.50కోట్టు ఉంటుందన్నారు. గంజాయిని, దాన్ని అక్రమ రవాణా చేస్తున్న జగదీశ్ దయారాం పాటిల్, సంజు కుమార్ ను అదుపులోకి తీసుకొని వీరిద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. మరో ఇద్దరు అమిత్ రోహిదాస్ పాటిల్, హరి పరారీలో ఉన్నారన్నారు. అశోక్ లేలాండ్ కంటైనర్ లారీ, రెండు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నామన్నారు. గంజాయిని, నేరస్తులను పట్టుకోవడంలో సహకరించిన సిసిఎస్ సీఐ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు వారి సిబ్బందిని, సుజాతనగర్ ఎస్సై రమాదేవిని వారి సిబ్బందిని ఈ కేసు విచారణాధికారి సిఐ వెంకటేశ్వర్లు, వారి సిబ్బందిని కేసు పర్యవేక్షణ అధికారి డీఎస్.పిని ఎస్పీ అభినందించారు.


