గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా..!
తుంగతుర్తి ఏరియా ఆసుపత్రిలో ప్రారంభం
కాకతీయ, తుంగతుర్తి : గర్భాశయ క్యాన్సర్ నివారణకు ముందుజాగ్రత్త చర్యగా హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని తుంగతుర్తి ఏరియా ఆసుపత్రిలో ప్రారంభించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని తుంగతుర్తి సర్పంచ్ సాయి బాబా లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో 14 సంవత్సరాల బాలికలకు టీకా వేస్తున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడేందుకు ఈ టీకా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం భవిష్యత్ తరాల మహిళలకు రక్షణ కల్పిస్తుందని తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో 14 సంవత్సరాల బాలికలకు ఈ టీకా అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ టీకా వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ ప్రియ, డాక్టర్ సాయి అశ్విని, డాక్టర్ లింగమూర్తి, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ నాగమణి, ఫార్మసిస్ట్ శోభతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


