ఇంకెన్నాళ్లు?
బేస్మెంట్కే పరిమితమైన పంచాయతీ భవనం..
గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన నిర్మాణం
స్కూలు గదిలోనే రుక్కితండా పాలన
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
కాకతీయ, కామేపల్లి: గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది రుక్కి తండా గ్రామ పంచాయతీ భవనం. నాలుగేళ్లు గడుస్తున్నా పునాదుల స్థాయిలోనే దర్శనమిస్తోంది. ప్రభుత్వ నిధులు రూ. 20 లక్షలు పునాదులకే పరిమితమయ్యాయి. ఆరేళ్ల క్రితం కొమ్మినేపల్లి మేజర్ పంచాయతీ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన రుక్కి తండాకు సొంత భవనం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇది గమనించిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ 2023లో రూ. 20 లక్షల ఈజీఎస్ నిధులతో శంకుస్థాపన చేశారు. అయితే, సదరు కాంట్రాక్టర్ బేస్మెంట్ స్థాయి వరకు నిర్మించి చేతులు దులుపుకున్నారు. దీంతో ఆ నిధులు కాస్తా నేలపాలయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాఠశాల గదిలో పంచాయతీ కార్యాలయం..
సొంత భవనం లేకపోవడంతో రుక్కి తండా ప్రాథమిక పాఠశాలలోని ఒక చిన్న ఇరుకు గదిలోనే పంచాయతీ కార్యాలయం కొనసాగుతోంది. అదే గదిలో గ్రామసభలు నిర్వహించడం, ప్రజల రాకపోకలు పెరగడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోంది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్, పాలకవర్గం, కార్యదర్శి ఎక్కడ విధులు నిర్వహించాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు. ఇదే భవనంలో అంగన్వాడీ కేంద్రం కూడా ఉండటంతో చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వంలో మా గోడు పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం ఇప్పుడైనా స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవ చూపి మా భవనాన్ని పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేనిపక్షంలో అధికారుల కార్యాలయాల ముందు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.


