స్మార్ట్ కిడ్జ్లో హోలీ సంబరాలు
ముందస్తుగా రంగుల పండుగ వేడుకలు
సహజ రంగులతో చిన్నారుల సందడి
సంస్కృతి పరిరక్షణపై అవగాహన
కాకతీయ, ఖమ్మం : స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో సోమవారం ముందస్తు హోలీ సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు. పాఠశాలలోని వివిధ తరగతుల విద్యార్థులు ఒకరికొకరు సాంప్రదాయ రంగులు పూసుకుంటూ రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. చిన్నారుల కిలకిలారావాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో హోలీ పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని విద్యార్థులకు పరిచయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. రసాయనిక రంగులు ఆరోగ్యానికి హానికరమని, సహజ రంగులతోనే హోలీ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


