కాకతీయ, అమరావతి: అనంతపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలను తీసుకున్నారు. ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాలు , పరిసర ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి గట్టి భద్రతను కల్పించారు.
అనంతపురం నగరంలోకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చారన్న సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి వైపు ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనంతపురంలో జరుగుతున్న ధర్నాకు వెళ్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోలీసులు పామిడి పట్టణ శివారులో అడ్డుకున్నారు. అనంతపురం వెళ్లేందుకు పర్మిషన్ లేదని చెప్పడంతో పామిడి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పటికే పలువురు ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎమ్మెల్యేపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆఱ్ కు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.


