బయోప్లాక్ చేపల సాగుతో అధిక లాభాలు
పాలేరులో మత్స్య రైతులకు ప్రత్యేక శిక్షణ
నాలుగు జిల్లాల నుంచి పాల్గొన్న 25 మంది రైతులు
కాకతీయ, కూసుమంచి : ఆధునిక సాంకేతికతతో చేపల సాగును లాభదాయకంగా మార్చే లక్ష్యంతో పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో బయోప్లాక్ విధానంపై మూడు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్), కేంద్ర వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు.
మొదటి రోజు కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల నుంచి 25 మంది మత్స్య రైతులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన బానోతు నాగులు నాయక్ మాట్లాడుతూ… మత్స్యరంగ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ పథకాలు, బ్యాంకు రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మత్స్య పరిశోధన కేంద్ర అధిపతి డాక్టర్ ఎం.శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ… బయోప్లాక్ విధానంలో ఫ్లాక్ తయారీ, నీటి నాణ్యత, వ్యాధి నియంత్రణ, లాభనష్టాలపై మూడు రోజులపాటు సమగ్ర అవగాహన కల్పిస్తామని తెలిపారు. శాస్త్రవేత్త బి.రవీందర్ నీటి నాణ్యత ప్రమాణాలు, పీహెచ్, ఆక్సిజన్ స్థాయిల నిర్వహణపై రైతులకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు.
శాస్త్రవేత్త పి.శాంతన్న బయోప్లాక్ ఏర్పాటుకు అవసరమైన ముడిసరుకులు, మేత యాజమాన్యం, స్థల ఎంపిక అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ కుమార్, కుమారి బానోతు దివ్య, సిగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


