గుమ్మడి నర్సయ్య ఇంటికి హీరో శివరాజ్‌కుమార్
కాకతీయ, కారెపల్లి : ఇల్లెందు ఎమ్మెల్యేగా ఐదుసార్లు ఎన్నికైన ప్రముఖ సామాజిక, రాజకీయవేత్త గుమ్మడి నర్సయ్యను కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ దంపతులు శనివారం కలుసుకున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని టేకులగూడెంలోని గుమ్మడి నర్సయ్య స్వగృహంలో కలిశారు. నర్సయ్య రాజకీయ జీవితచరిత్రపై గుమ్మడి నర్సయ్య అనే సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గుమ్మడి నర్సయ్య బయోపిక్‌లో శివరాజ్‌కుమార్ కథానాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్ ఇప్పటికే నెట్టింట్లో వైరల్ మారిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఓవైపు జరుగుతుండగా.. గుమ్మడి నర్సయ్య జీవితంలో జరిగిన అనేక అంశాలపై చిత్ర యూనిట్ అధ్యయనం చేస్తోంది. గుమ్మడి నర్సయ్య పాత్రలో నటిస్తున్న శివరాజ్‌కుమార్ ఆయనతో నేరుగా భేటీ కావాలనే ఆసక్తితో శనివారం మధ్యాహ్నం టేకులగూడెంలోని ఆయన ఇంటికి సతీసమేతంగా వెళ్లడం గమనార్హం. శనివారం పాల్వంచలో సినిమా ప్రారంభ వేడుక జరగనుంది. ప్రజల మనిషిగా పేరొందిన గుమ్మడి చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన తనకు తండ్రిలాంటి వారని ఈసందర్భంగా శివరాజ్‌కుమార్ చెప్పారు.



