భార్యను చంపి.. తానూ ఉరేసుకుని
భూపాలపల్లి జిల్లా సీతారాంపురంలో దంపతుల హత్య, ఆత్మహత్యా
భార్య టార్చర్ పెడుతోందంటూ భర్త సెల్ఫీవీడియో స్టేటస్
కుటుంబ కలహాలతోనే భార్యభర్తల మధ్య విబేధాలు
కొంతకాలంగా తల్లిగారింట్లో భార్య.. ఓటేసేందుకు గ్రామానికి వచ్చి భర్త వద్దకు
భార్య నిద్రలో ఉండగా తాడుతో ఉరేసిన భర్త
అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్య
కాకతీయ: గణపురం : భార్య మానసిక వేధింపులు భరించలేక భర్త ఆమెకు ఉరివేసి హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడిన దారుణ సంఘటన భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి(52) గణపురం మండలం మైలారం గ్రామానికి చెందిన సంధ్యను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉండగా, ఆమె గతంలో ఆత్మహత్య చేసుకుంది. రెండో భార్య సంధ్యకు ఒక కుమార్తె వైష్ణవి ఉంది. సుమారు రెండు నెలల క్రితం వైష్ణవి కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడంతో, అప్పటి నుంచే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ విషయమై భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు రామాచారి నాలుగేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ గొడవలతో సంధ్య కొంతకాలంగా తల్లిగారి ఇంట్లో ఉంటోంది. ఈ నెల 11వ తేదీన ఓటు వేయడానికి సీతారాంపురం వచ్చింది. భర్త బ్రతిమిలాడటంతో ఆమె రెండు రోజులుగా ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం రామాచారి నిద్రలో ఉన్న భార్య సంధ్యను తాడుతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం తాను ఈ పని ఎందుకు చేశాననే విషయాన్ని వివరించే వీడియోను రికార్డు చేసి, వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. ఆ తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో చూసిన సంధ్య కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు పరిశీలించగా భార్యభర్తలిద్దరూ మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. మృతురాలి తల్లి సెగ్గోజు భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు, సంధ్య హత్యకు సంబంధించి రామాచారిపై హత్య కేసు నమోదు చేసి, అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు గణపురం ఎస్సై ఆర్. అశోక్ తెలిపారు.



