ఘనంగా సేవాలాల్ జయంతి
గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో వేడుకలు
ఏటిగడ్డ కిస్టాపూర్‌లో సంప్రదాయంగా కార్యక్రమాలు
పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీ
మార్మోగిన జై సేవాలాల్ నినాదాలు
మహిళలు, యువతుల సాంప్రదాయ ప్రదర్శనలు
సేవాలాల్ ఆశయాలను ఆచరించాలన్న పెద్దలు
కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రాంతాల్లో ఆదివాసీ, బంజారా సమాజ ఆధ్యాత్మిక మార్గదర్శి శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే కాలనీల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇళ్ల ముందు రంగోలీలు వేసి, వీధులను జెండాలు, పతాకాలతో అలంకరించారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు భక్తి గీతాలు ఆలపించగా, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


కాలనీ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా మీదుగా సాగింది. చేతుల్లో జెండాలు పట్టుకుని యువత చేసిన జై సేవాలాల్ నినాదాలతో పట్టణ వీధులు మార్మోగాయి. ర్యాలీ అనంతరం జరిగిన సభలో బంజారా ప్రజలు సేవాలాల్ మహారాజ్ జీవితం, బోధనలను స్మరించారు. ఈ సందర్భంగా బంజారా పెద్దలు మాట్లాడుతూ… 18వ శతాబ్దంలో జీవించిన సేవాలాల్ బంజారా, లంబాడీ సమాజాలకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేసి ఐక్యత, నిజాయితీ, అహింస వంటి విలువలను బోధించారని అన్నారు. సమాజంలో మూఢనమ్మకాలు, విభేదాలను రూపుమాపేందుకు కృషి చేసిన మహనీయుడిని కొనియాడారు. సేవాలాల్ మహారాజ్ ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకం అన్నారు. బంజారా ఆత్మగౌరవం, సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.


