కాకతీయ, తెలంగాణ బ్యూరో : సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో ఉదయం గన్ మిస్‌ఫైర్ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం.. సీఐ అనిల్ కుమార్ తన గదిలో సర్వీస్ రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా, అనుకోకుండా ట్రిగర్‌కు చేయి తగలడంతో బుల్లెట్ పేలింది. ఆ బుల్లెట్ పక్కన నిలబడి ఉన్న హెడ్ కానిస్టేబుల్ పక్కగా దూసుకెళ్లింది. క్షణం ఆలస్యం అయితే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉండేది.
ఈ ఘటనతో కార్యాలయంలో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. వెంటనే అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు సమాచారం ఉంది. వారు ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీస్ శాఖలో ఆయుధాల వినియోగం, భద్రతా నిబంధనలు పాటించాల్సిన అవసరంపై అధికారులు మరోసారి దృష్టి సారించారు.


