క్యాడర్ ఉంది, లీడర్ ఎవరు.?
గూడెం బీఆర్ఎస్‌కు నాయకత్వ కొరత
వనమా పార్టీ మారుతారంటూ జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం
రాఘవ సస్పెన్షన్ ఎత్తివేయకుంటే కఠిన నిర్ణయానికి సన్నద్ధం?
ఉన్న నాయకత్వాన్ని వదలుకోవడంపై గులాబీ శ్రేణుల్లో గుస్సా
రాఘవను పార్టీలో ఆక్టివ్ చేసేందుకూ మొదలైన యత్నాలు
పార్టీ అధినాయకత్వం నిర్ణయంపై ఎదురు చూపులు..!!
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : నియోజకవర్గంలో ప్రభావశీలమైన క్యాడర్ ఉన్న పార్టీకి నడిపించే నాయకుడు కరువయ్యారు. కోల్‌బెల్ట్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి సరైన నాయకత్వం లేక శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత గులాబీ లీడర్లు కాస్త డల్లయ్యారు. వనమా వెంకటేశ్వర్లు వయసు రీత్య క్షేత్రస్థాయి రాజకీయాల్లో చురుకుగా పాల్గొనలేకపోతున్నారు.
ఆయన తనయుడు వనమా రాఘవపై కొనసాగుతున్న పార్టీ సస్పెన్షన్ వేటును తొలగించేందుకు ఇటీవల కొంతమంది లీడర్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు. స్వతహాగా మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు కూడా కొడుకు రాజకీయ భవిష్యత్‌పైనా ఆందోళనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. వయస్సురీత్య ప్రత్యక్ష రాజకీయాల్లో ఆక్టివ్ పార్టిసీపేషన్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్న వనమా.. కొడుకు రాఘవను పార్టీలో ఆక్టివ్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాఘవపై గతంలో వచ్చిన ఆరోపణలు, ఆయన వ్యవహార శైలితో గులాబీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
వనమా కఠిన నిర్ణయానికి సిద్ధమేనా..?!
తనయుడు వనమా రాఘవను కొత్తగూడెం రాజకీయాల్లో నిలదొక్కుకునేలా చేసేందుకు వనమా వెంకటేశ్వర్లు సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ నాయకత్వానికి కూడా తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లుగా వివరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పరిణామం కంటే ముందే వనమా వెంకటేశ్వర్లు ఓ జాతీయ పార్టీలోకి మారుతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా చర్చలు మొదలయ్యాయి. కొడుకుపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే తన దారి తాను చూసుకుంటానని, తమకు కొత్తగూడెంలో ఉనికి లేకుండా చేసే రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని కూడా వనమా సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది.
ఈక్రమంలోనే వనమా కుటుంబానికి వ్యతిరేకంగా.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న ఓ నేత అనుచర వర్గం రాఘవపై సస్పెన్షన్ ఎత్తివేతను అడ్డుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ మహిళా లీడర్‌తో పాటు మరికొంతమంది ఈ విషయంలో పట్టుబడుతున్నట్లుగా కూడా చర్చ జరుగుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం అవుట్ రైట్‌గా ఓ నిర్ణయానికి వచ్చిన వనమా వెంకటేశ్వర్లు గులాబీ అధిష్ఠానం నుంచి రాఘవపై సస్పెన్షన్ ఎత్తివేతకు ఓ విస్పష్టమైన హామీ ఇటీవల లభించడంతో ఆయన పార్టీ మార్పుపై వెనక్కి తగ్గినట్లుగా కూడా గూడెం రాజకీయాల్లో జరుగుతోంది.
పార్టీ అధినాయకత్వం నిర్ణయంపై ఎదురు చూపులు..!!
కొత్తగూడెం నియోజకవర్గ నాయకత్వం కొరతను తీర్చేందుకు పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనే దానిపై శ్రేణులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వనమా ఫ్యామిలీని పార్టీ పూర్తిగా దూరం చేస్తుందా..?! అసలు వనమా ఓటమి తర్వాత కనీసం కార్యకర్తలను పట్టించుకునే వారే లేకుండా ఉన్న పరిస్థితి నుంచి కాస్తో కూస్తో పార్టీని పట్టించుకుంటాడానే వనమా రాఘవపై సస్పెన్షన్ ఎత్తివేతకు సిద్ధపడి ఆక్టివ్ చేసేందుకు చర్యలు తీసుకుంటుందా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాఘవర రావాలని కోరుకునే వారెంత మంది ఉన్నారో.. వద్దని అనుకునే లీడర్లు అంతే మంది ఉన్నారు.? లీడర్లను ఒప్పించి.. కార్యకర్తలను మెప్పించే విధంగా రాఘవకు అనుకూలంగా నిర్ణయం ఉంటుందా..? కొంతమంది లీడర్ల అభిప్రాయానికే అధిష్ఠానం కట్టుబడుతుందా అన్నది మరి కొద్దిరోజులు ఆగితేగాని తేలదని తెలుస్తోంది.


