మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్
▪️ అడ్మిషన్ పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ అశ్విని
▪️ ఐదవ తరగతి నుంచి ఇంటర్, వృత్తి విద్య వరకూ అవకాశాలు
▪️ ఐఐటీ, నీట్, ఈఏపీసెట్‌కు ప్రత్యేక కోచింగ్
▪️ జనవరి 16 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు
▪️ కరీంనగర్ జిల్లాలో 9 మైనారిటీ గురుకులాలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా గురువారం జిల్లా అదనపు కలెక్టర్ డా. అశ్విని తనాజీ వాకాడే మైనారిటీ గురుకులాల అడ్మిషన్ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. మైనారిటీ విద్యార్థులు ప్రభుత్వ అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఐదవ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలతో పాటు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో కూడా అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. విద్యతో పాటు పోటీ పరీక్షలకు సమగ్ర శిక్షణ అందించడమే గురుకులాల లక్ష్యమని స్పష్టం చేశారు.
విస్తృత కోర్సులు – ప్రత్యేక శిక్షణ
మైనారిటీ గురుకులాల్లో ఐదవ తరగతితో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఎంసీపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా వృత్తి విద్య విభాగాల్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గురుకుల కళాశాలల్లో ఐఐటీ, నీట్, ఈఏపీసెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మిగులు సీట్లు – ఆన్‌లైన్ దరఖాస్తులు
ఆరు, ఏడు, ఎనిమిదవ తరగతుల్లో మైనారిటీ మిగులు సీట్లు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం ఐదు బాలుర మైనారిటీ గురుకుల విద్యాసంస్థలు, నాలుగు బాలికల గురుకుల విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రాంతీయ స్థాయి సమన్వయ అధికారి విమల, విజిలెన్స్ అధికారులు అక్రమ్ పాషా, ఇంతియాజ్, ప్రిన్సిపాళ్లు వీర్ల మహేష్, పోరండ్ల చంద్రమోహన్, పిడిశెట్టి సంపత్, కనిపర్త సురేష్, మౌనిక సోని, వార్డెన్లు సైఫుద్దీన్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.


