నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు
మిల్లర్లకు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి హెచ్చరిక
రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నిబంధనలు పాటించే రైస్ మిల్లర్లకే ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. అదనపు కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆశించిన స్థాయిలో సజావుగా జరగడం లేదని తెలిపారు. జిల్లాలో ఉన్న 71 రైస్ మిల్లుల్లో ఇప్పటి వరకు 63 రైస్ మిల్లర్లు మాత్రమే బ్యాంకు గ్యారంటీ లు సమర్పించారని, మిగిలిన 8 మిల్లులకు ఎట్టి పరిస్థితులలో ధాన్యం కేటాయింపులు జరగవని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
8 మిల్లులు గతంలో పెండింగ్ ఉన్న రైస్ డెలివరీ పూర్తి చేసి, బ్యాంక్ గ్యారంటీలు సమర్పిస్తే ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయింపు పై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 10 శాతం బ్యాంకు గ్యారంటీ, పెండింగ్ యాసంగి రైస్ డెలివరీ పూర్తి చేయని పక్షంలో రైస్ మిల్లులకు గోడౌన్ ట్యాగ్ చేయడం జరగదని అన్నారు.
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం తీసుకున్న ప్రతి రైస్ మిల్లర్ తప్పనిసరిగా యాసంగి కేటాయింపు తీసుకోవాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి సీజన్ లో 2 నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లర్లకు కేటాయించాల్సి ఉంటుందని, దీనికి అనుగుణంగా మిల్లర్లు కొల్లేటరల్ బ్యాంకు గ్యారంటీ సిద్దం చేసుకోవాలని అన్నారు. రైస్ డెలివరీకి సంబంధించి గోదాముల సమస్య పరిష్కారం కోసం నూతన గోదాముల నిర్మాణం చేపట్టామని అన్నారు. రైస్ మిల్లులకు ఉన్న వివిధ సమస్యల సంబంధించి దరఖాస్తులు అందిస్తే ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని అన్నారు.
సమావేశంలో జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు బొమ్మ రాజేశ్వర రావు మాట్లాడుతూ ప్రతి సీజన్ 1,70,000 మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుందని, ఇక్కడ గోదాముల ప్లేస్ సరిపోయేంత లేదని అన్నారు. గోడౌన్ సమస్య వల్ల దూర ప్రాంతాలకు బియ్యం డెలీవరి సమయంలో రవాణా ఖర్చులు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, సంబంధిత అధికారులు, మిల్లర్ లు, తదితరులు పాల్గొన్నారు.


