కాంగ్రెస్ గూటికి పంది రాజు గౌడ్
రాష్ట్ర గౌడ యువజన సంఘం అధ్యక్షుడి కీలక నిర్ణయం
కాకతీయ, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర గౌడ యువజన సంఘం అధ్యక్షుడు పంది రాజు గౌడ్ శనివారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నూతి సత్యనారాయణ సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. నూతి సత్యనారాయణ మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గంలో మంచి పట్టున్న యువ నాయకుడు పంది రాజు గౌడ్ కాంగ్రెస్‌లో చేరడం పార్టీని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు. పార్టీలో చేరిన అనంతరం పంది రాజు గౌడ్ మాట్లాడుతూ దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీనే సరైన వేదిక అన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో ముందుకు సాగుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పంది రాజు గౌడ్ అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


