- స్పెషల్ జ్యూడీషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలని స్పెషల్ జ్యూడీషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు అన్నారు. ప్రపంచ బాలిక దినోత్సవం సందర్భంగా పాల్వంచలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాలికల పట్ల సమాజంలో ఇంకా కొనసాగుతున్న అసమానతలు, వివక్ష, భద్రతా లోపాలు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు అవగాహన అవసరమని తెలిపారు. బాలికల విద్య, వైద్యసేవలు, పోషణ, రక్షణ వంటి హక్కులను కాపాడడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతీ సంవత్సరం అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించడం వెనుక ఉద్దేశం బాలికల హక్కుల పరిరక్షణతో పాటు సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడమే అని తెలిపారు.
సమాచార హక్కు చట్టం గురించి అవగాహన కల్పించారు. బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గోపికృష్ణ మాట్లాడుతూ ప్రతీ బాలిక తన ప్రతిభతో సమాజంలో మార్పుకు దారితీయగలదని చెప్పారు. విద్యార్థినులు పట్టుదల, సమయస్ఫూర్తి, ఉన్నత లక్ష్యాలతో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బాలలు లేదా బాలికలు ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా అత్యవసర నంబర్లు 100, 112 ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలల భద్రతలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ భాగం మాధవరావు, సిడబ్ల్యూసి మెంబర్ సాధిక్ పాషా, కళాశాల ప్రిన్సిపాల్ పి.అనురాధ, వైస్ ప్రిన్సిపాల్ ఆర్.సంగీత, అధ్యాపకులు పుష్ప, రమ్య, సునీత విద్యార్థులు పాల్గొన్నారు.


