అక్రమ మట్టి తవ్వకంపై కలెక్టరుకు ఫిర్యాదు
కెనాల్ నుంచి ట్రాక్టర్లతో మట్టి తరలింపు ఆరోపణ
పూర్తిస్థాయి విచారణకు కలెక్టర్ ఆదేశాలు
కాకతీయ, గీసుగొండ : ఎస్సారెస్పీ ఎత్తిపోతల కాలువ నుంచి అక్రమంగా మట్టి తవ్వి తరలించిన ఘటనపై సూర్య తండ గ్రామ సర్పంచ్ బానోతు రాఘవేంద్ర జిల్లా కలెక్టర్ సత్య శారద, పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌లకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 24న సూర్య తండ గ్రామ పరిధిలోని కాలువ నుంచి 10కు పైగా ట్రాక్టర్లు, ఒక జేసీబీ సహాయంతో మట్టి తవ్వి తరలిస్తున్నట్లు గుర్తించి అడ్డుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వాగ్వాదం జరిగిందన్నారు. సీఐకి ఫిర్యాదు చేయగా జేసీబీతో పాటు కొన్ని ట్రాక్టర్లపై మాత్రమే కేసులు నమోదు చేసి, మిగతా వాహనాలపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా ప్రశ్నించిన తనపై అవమానకర పదజాలంతో బెదిరింపులు జరిగాయని, ఒక గిరిజన సామాజిక కార్యకర్తను ఫోన్ ద్వారా బెదిరించి అనంతరం పోలీసు వాహనంలో తీసుకెళ్లారని పేర్కొన్నారు.
సంబంధిత సీఐ, సిబ్బంది కాల్ వివరాలు, పోలీసు జీప్ గమన వివరాలు, స్టేషన్ సీసీటీవీ దృశ్యాలు, సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను స్వాధీనం చేసుకుని సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమ మట్టి తవ్వకానికి బాధ్యులపై పూర్తి స్థాయి జరిమానా విధించి ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు, సైన్‌యరేజ్, నష్టపరిహారం వసూలు చేయాలని కోరారు.ఈ అంశంపై కలెక్టర్ స్పందించి ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్‌కు పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు సర్పంచ్ తెలిపారు.


