వరదల తర్వాత జీసీసీ సేల్స్ డిపో దుస్థితి
తక్షణ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్
కాకతీయ, ఏటూరునాగారం :ములుగుజిల్లాఏటూరునాగారం మండలం అల్లం వారి ఘనపురంకు చెందిన గిరిజన సహకార సంస్థ (జీసీసీ ) డి.ఆర్ సేల్స్ డిపో గత మూడు సంవత్సరాల క్రితం సంభవించిన వరదల ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్నది. డిపోలోని ప్లోరింగ్ పూర్తిగా కృంగిపోయి, స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయి. దీంతో అక్కడ నిల్వ ఉంచిన బియ్యం సంచులు ఎలుకలు, పందికొక్కుల వల్ల కొరికిపడి నాశనం అవుతున్నాయి. ఈ కారణంగా బియ్యంలో మట్టి, రాళ్లు కలసి నాణ్యత పూర్తిగా దెబ్బతింటోంది.
ఈ డిపోపై ఆధారపడి సరుకులు తీసుకుంటున్న మూడు గ్రామాల ఆదివాసీ గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాణ్యతలేని బియ్యం సరఫరా కావడంతో ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో డిపోకు తక్షణమే మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని తుడుందెబ్బ మండల కమిటీ డిమాండ్ చేసింది. అదేవిధంగా, ఏటూరునాగారం మండలంలో ఉన్న ఇతర జీసీసీ సేల్స్ డిపోలను కూడా అధికారులు సందర్శించి వాటి స్థితిగతులు పరిశీలించి, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని కమిటీ కోరింది.
ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి, గిరిజనుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


