ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి
లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
ఇంటిలో, కార్యాలయంలో సోదాలు
కాకతీయ, తుంగతుర్తి : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామపంచాయతీ కార్యదర్శి బర్పటి కృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం లంచం తీసుకుంటున్న సమయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గానుగబండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే గ్రామ కార్యదర్శి బర్పటి కృష్ణ రూ.6 వేల లంచం డిమాండ్ చేస్తున్నాడని ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పథకం రచించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో సదరు వ్యక్తి లంచం డబ్బులు ఇస్తుండగా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేసి బర్పటి కృష్ణను పట్టుకున్నారు. ఈ ఘటన అనంతరం గానుగబండ గ్రామంలోని కార్యదర్శి నివాసం, గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన గ్రామ కార్యదర్శిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.


