పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల
సిసిఐ నిబంధనలు సడలించాలి
మిల్లుల సమ్మె వెంటనే విరమింపజేయాలి
కాకతీయ, కరీంనగర్ : పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సిసిఐ కొనుగోలు విధానాల్లో మార్పులు చేసి, రైతులకు ఉపశమనం కల్పించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు పత్తి రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన తెలుపుతూ అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్‌కు వినతిపత్రం సమర్పించారు.గంగుల కమలాకర్ మాట్లాడుతూ.ప్రస్తుత పరిస్థితుల్లో రైతు పండించిన పత్తి మొత్తం కొనుగోలు అయ్యేలా సిసిఐ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిసిఐ జిన్నింగ్ మిల్లులకు ఎల్–1, ఎల్–2, ఎల్–3 అంటూ కేటాయింపులు చేసి ప్రతి మిల్లుకు 1450 క్వింటాళ్ల పరిమితి విధించడంతో రైతులు ఒకే మిల్లుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల మిల్లు యజమానులు కొర్రీలు పెట్టి రైతులను నష్టపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిమితిని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.పత్తి రైతుల్లో పెద్దశాతం కౌలు రైతులేనని, గతంలో పట్టేదారు ఆధార్,పాసుబుక్ సమర్పిస్తే వచ్చిన ఓటిపి ద్వారా సిసిఐ కొనుగోలు జరిగేదని గుర్తు చేశారు. అయితే ఇప్పుడది నిలిపివేసి, తప్పనిసరిగా పట్టేదారే వచ్చి వేలిముద్రతో స్లాట్ బుక్ చేయాల్సిన నిబంధన పెట్టడం కౌలు రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోందని పేర్కొన్నారు. ఈ నిబంధన రైతు ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమని తెలిపారు.మునుపు సిసిఐ రైతు నుంచి ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోలు చేసేదని, అయితే ఇప్పుడది 7 క్వింటాళ్లకు తగ్గించడంతో మిగిలిన పత్తిని రైతులు ప్రైవేటు దళారులకే అమ్మాల్సిన దుస్థితి నెలకొన్నదని కమలాకర్ వివరించారు. సిసిఐ రేటు రూ.8,110 ఉండగా దళారులు రూ.6,000 మాత్రమే ఇస్తుండటంతో క్వింటాల్‌కు రూ.2,100, ఎకరాకు రూ.16వేలకు పైగా రైతు నష్టపోతున్నాడని పేర్కొన్నారు.ఇక అకాల వర్షాల వలన పత్తి కాయలు నల్లబారిపోయి, సిసిఐ ‘నష్టం’ అంటూ కొనుగోలు నిరాకరిస్తోందని, దళారులు మాత్రం నాలుగు,ఐదు వేలకే కొనడం వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో జిన్నింగ్ మిల్లు యజమానుల సమ్మె కొనసాగుతోందని, దాని ప్రభావం రైతులపై పడుతోందని పేర్కొంటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని మిల్లుల సమ్మె విరమింపజేసి, సిసిఐ ద్వారా పత్తి మొత్తాన్ని కొనుగోలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని
భారత రాష్ట్ర సమితి తరఫున గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.



