గజ్వేల్ గడ్డ.. కేసీఆర్ అడ్డా
పదేళ్లలో జీపీ నుంచి మున్సిపాలిటీ..
మూడుసార్లు మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ దే
గులాబీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి
కాకతీయ, గజ్వేల్ : పదేళ్లలో గజ్వేల్లో జరిగిన అభివృద్ధే తమకు ప్రధాన బలం అని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందడం, వరుసగా మూడు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం ప్రజల మద్దతుకు నిదర్శనమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2014లో సుమారు 15 వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీగా ఉన్న గజ్వేల్ నేడు మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గజ్వేల్ రూపురేఖలు పూర్తిగా మారాయి. వరుసగా మూడు విడతల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని గెలుచుకుంది. అందుకే గజ్వేల్ గడ్డ, కేసీఆర్ అడ్డా అన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో దాదాపు 90 శాతం సీసీ రహదారులు, 80 శాతం భూగర్భ డ్రైనేజీ పనులు, మహతి ఆడిటోరియం, ఆర్డీవో కార్యాలయం, ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేశాం అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందుతోంది అని తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 9 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కౌన్సిలర్లను ఒక్కొక్కరిని కోటి రూపాయల చొప్పున కాంగ్రెస్ పార్టీకి అమ్ముకున్నారు అని ఆరోపించారు. ఈ విషయంపై రఘునందన్ రావు దమ్ముంటే గజ్వేల్ కోట మైసమ్మ తల్లి సాక్షిగా వచ్చి ప్రమాణం చేయాలని అన్నారు. ప్రజలు నమ్మి వేసిన ఓట్లను వ్యాపారంగా మార్చడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అన్నారు. రాబోవు పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లాలో మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని, ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన, వైస్ చైర్మన్ కళ్యాణ్ కర్ పద్మాబాయి, మాజీ చైర్మన్ ఎన్ సి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు


