- ఫుట్ పాత్ పై ప్లాంటేషన్, స్ట్రీట్ లైటింగ్
- సైకిల్ ట్రాక్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలి
- రాంగ్ రూట్ డ్రైవింగ్ అరికట్టేందుకు పటిష్ట చర్యలు
- రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యలపై కలెక్టర్ అనుదీప్ సమీక్ష
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నగరంలోని ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి ఖమ్మం నగరంలో ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్ ల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల గురించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం నగరంలో వైరా రోడ్డు, బైపాస్, ఇల్లందు రోడ్డు వంటి 8 ప్రధాన రోడ్లకు సంబంధించి ఫుట్ పాత్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫుట్ పాత్ పై ఏర్పాటు చేయాల్సిన ప్లాంటేషన్, స్ట్రీట్ లైటింగ్, టైల్స్, సైకిల్ ట్రాక్ ఏర్పాటు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.
నగరంలో అవసరమైన చోట పుట్ పాత్ వద్ద బస్ బే సైతం ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. దేశంలోని ఇతర నగరాలలో ఉన్న డిజైన్లను పరిశీలించి, ఖమ్మం నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంచి డిజైన్ తయారు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సెంట్రల్ డివైడర్ తో పాటు ఫుట్ పాత్ వే అధికంగా ఉండేలా చూడాలని అన్నారు. దాంతో పాటు పోల్స్, లైటింగ్ ప్రత్యేకంగా ఉండాలని అన్నారు. నగరంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ అరికట్టడానికి ఏఐ సాంకేతికత సహాయంతో దీనిని గుర్తించేలా ఏర్పాట్లు చేసి, రోడ్ల ప్రమాదాల నియంత్రణకు నగరంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నగరంలో పలు చోట్ల గుంతలను పూడ్చి రోడ్లను మరమ్మత్తు చేశామని, ప్రస్తుతం లేన్ మార్కింగ్ పనులు కూడా జరుగుతున్నాయని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులు పాటించేలా పకడ్బందీ పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో మునిసిపల్ డిఇ ధరణి కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


