కాకతీయ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. తన ముగ్గురు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు తండ్రి. తర్వాత తానూ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలేం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు, దీపిక దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మోక్షిత, వర్షిణి, శివధర్మ. భార్యతో కలహాల నేపథ్యంలో గతనెల 30వ తేదీన కుమార్తెలు, కుమారుడిని తీసుకుని వెంకటేశ్వర్లు శ్రీశైలం వెళ్లాడు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి పిల్లలను తీసుకుని నాగర్ కర్నూల్ లోని అచ్చంపేట మండలం హాజీపూర్ కు చేరుకున్నాడు.
31వ తేదీన ఉప్పునుంతల మండలం సూర్యతండా సమీపంలో చిన్నకుమార్తె వర్షిణీ, కుమారుడు శివధర్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో పెద్దకుమార్తెను అదే తరహాలో చంపేశాడు. కల్వకుర్తి పట్టణానికి వెళ్లి పురుగుల మందు కొన్నాడు. వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
వెంకటేశ్వర్లు డెడ్ బాడీ లభ్యం కావడంతో అతని సోదరుడు మల్లికార్జున ఇచ్చిన ఫిర్యాదుదో వెల్దండ ఎస్సై కురుమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు చిన్నారుల కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించి..హైదరాబాద్ శ్రీశైలం జాతీయరహదారికి ఇరువైపులా ప్రత్యేక బ్రుందాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలోనే కాలిన స్థితిలో చిన్నారుల డెడ్ బాడీలు లభ్యమయ్యాయి.


