కూతుర్ని చంపి, కొడుకుకి ఉరి వేసిన తండ్రి అరెస్ట్
కాకతీయ, కరీంనగర్ : ఇద్దరు పిల్లలు అంగవైకల్యాలతో బాధపడుతుండటంతో మానసిక వేదనకు గురైన ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. కూతుర్ని ఉరివేసి చంపి, కొడుకుపై కూడా అదే పద్ధతిలో హత్యాయత్నం చేసిన ఘటన కరీంనగర్ పట్టణంలో వెలుగుచూసింది. నిందితుడైన అనవేణి మల్లేష్ (38)ను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.2009లో మల్లేష్,పోసవ్వలకు హర్షిత్, హర్షిత అనే ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ చిన్నప్పటి నుంచే మానసిక, శారీరక అంగవైకల్యాలు. నిలోఫర్, ఉస్మానియా, నిమ్స్, బోయినపల్లి నేషనల్ హ్యాండీక్యాప్డ్ ఆసుపత్రి, కరీంనగర్‌లోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, తిరుపతి బర్డ్స్, స్విమ్స్—ఎక్కడ పరీక్షలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో మల్లేష్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. స్విమ్స్ వైద్యులు పిల్లల పరిస్థితి జీవితాంతం అలాగే ఉంటుందని చెప్పడంతో అతనిలో నిరాశ మరింతగా పెరిగిందని పోలీసులు వెల్లడించారు.15వ తేదీ మధ్యాహ్నం భార్య మార్కెట్‌కు వెళ్లిన అవకాశాన్ని నిందితుడు ఉపయోగించుకున్నాడు. ముందుగా చల్లని పానీయంలో పురుగుమందు కలిపి పిల్లలకు ఇవ్వడానికి ప్రయత్నించినా వారు తాగకపోవడంతో యత్నం విఫలమైంది. వెంటనే కాటన్ గుడ్డను రెండు భాగాలుగా చించి కూతురు హర్షిత, కొడుకు హర్షిత్ మెడలకు ఉరి వేసినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. ఈ దారుణంలో కూతురు మృతి చెందగా, కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు.తరువాత టవల్ ముక్కలను బయట పడేసి, ఇంటి నుంచి పారిపోయిన మల్లేష్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ చేరి అక్కడ లాడ్జ్‌లో తలదాచుకున్నాడు. మరుసటి రోజు మంచిర్యాలలో తిరుగుతూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గాలింపు దళాలు మల్లేష్‌ను చివరకు 17వ తేదీ ఉదయం కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి.కేసు సంఖ్య 439/2025గా, భారత న్యాయ విధానం సెక్షన్లు 103(1), 109(1) కింద నమోదు చేసినట్లు త్రీటౌన్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి తెలిపారు. నిందితుడి మొబైల్ ఫోన్, కరీంనగర్–హైదరాబాద్, జేబీఎస్–మంచిర్యాల మార్గాల రెండు బస్‌టికెట్లు, హత్యకు ఉపయోగించిన కాటన్ గుడ్డముక్కలను పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.


