కాకతీయ, నల్లబెల్లి: రైతులే దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు. కానీ, వ్యవసాయం కోసం అత్యవసరమైన యూరియా కోసం రాత్రింబవళ్లు క్యూలో నిలబడి తిప్పలు పడాల్సి వస్తున్న దుస్థితి మండలంలోని మేడపెల్లి, రాంపూర్ గ్రామాల్లో కనిపించింది. సోమవారం రాత్రి 11 గంటల నుంచే టోకెన్ల కోసం రైతులు రైతు వేదిక వద్ద క్యూ లైన్‌లో నిలబడ్డారు.
మంగళవారం ఉదయం టోకెన్ల పంపిణీ ప్రారంభమైన వేళ రైతులు ఒకేసారిగా ఎగబడడంతో కొంత తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ గందరగోళంలో ఒక రైతు గాయపడ్డారు. ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు ఒక యూరియా బస్తా దొరికినా, ఇంకో బస్తా కోసం వారం రోజులు ఎదురు చూడాల్సిందే. ఇదెట్లా సాగు? అని ప్రశ్నిస్తున్నారు.
ఎంతో కష్టపడి కూడగట్టిన పొలాలను సాగు చేయాలంటే మద్దతుగా ఉండాల్సిన వ్యవసాయ శాఖ, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం రైతులను మరింత నిరాశలోకి నెడుతోంది. రైతులు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు. ఇది మార్పా? ఇది ప్రజాపాలనా?”
రైతన్నలు కోరుతున్నది యూరియా, సరళంగా అందుబాటులోకి రావాలి. తక్షణమే వ్యవసాయ శాఖ, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి ఈ సమస్యపై సమీక్ష నిర్వహించి, నిలకడైన సరఫరా వ్యవస్థను ఏర్పరిచి, రైతులకు భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


