కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: అంతర పంటల సాగుతో రైతులు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం ములకలపల్లి మండలం మూక మామిడి పంచాయతీ పరిధిలోని గుట్టగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వెదురు సాగును జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రైతులు కనితి భద్రయ్య, కనితి రాధా, కనితి పొట్టమ్మల పొలాల్లో స్వయంగా వెదురు మొక్కలు నాటి, గ్రామీణ వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు.
అనంతరం మొగరాల గొప్ప గ్రామంలో రైతు కీసర సుజాత వెదురు సాగును మొక్కను నాటి ప్రారంభించారు .అనంతరం కుండ్రు వెంకటమ్మ ఎకరం పొలంలో సాగు చేస్తున్న మునగ తోటను, గడ్డం వారి గుంపు గ్రామంలో రైతు కొమ్ము బుచ్చన్న సాగు చేస్తున్న రెండెకరాల మునగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన కలెక్టర్ , “ప్రతి రైతు సంప్రదాయ పంటలతో పాటు కొత్త పంటలను ప్రయత్నించాలి.
అంతర్ పంటల సాగు ద్వారా తక్కువ భూమిలోనూ అధిక ఆదాయం పొందవచ్చు. ఆయిల్ పామ్ తోటల్లో మునగ, బెండలను వేసుకుంటే అదనపు ఆదాయం వస్తుంది. వెదురు సాగులో పెసలు, బొబ్బర్లు, మినుములు, రాగి వంటి పంటలు వేసుకుంటే కుటుంబ ఆదాయం మరింతగా పెరుగుతుంది అని అన్నారు.


