చీడపీడలపై రైతులకు అవగాహన
జింక్ లోపం నివారణపై సూచనలు
కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామంలో వరి పొలాలను డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్, మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన వారు వరిలో వచ్చే చీడపీడలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం కిష్టాపురం గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు నమోదు ప్రక్రియ, యూరియా బుకింగ్ యాప్, పంట నమోదు అంశాలపై వివరించారు. ప్రభుత్వ పథకాలు సకాలంలో అందాలంటే పంట నమోదు తప్పనిసరిగా చేయాలని తెలిపారు. రైతులు మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకుని ఎరువుల కొరత సమస్యను నివారించుకోవచ్చని సూచించారు. గ్రామంలోని వరి పైరును పరిశీలించిన అధికారులు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జింక్ లోపం కనిపిస్తున్నట్లు గుర్తించారు. దీనికి నివారణగా లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారి చేయాలని రైతులకు సూచించారు. అలాగే సమతుల్య ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం పాటించాలని తెలిపారు. పంట దశకు అనుగుణంగా ఎరువులు వేయాలని, తెగుళ్లు కనిపించిన వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. పొలాల్లో కలుపు నియంత్రణ, సరైన అంతరాల పద్ధతిలో నాట్లు వేయడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చని వివరించారు. రైతులు శాస్త్రీయ పద్ధతులు అనుసరించి సాగు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు జానీ బాబా, వంశీకృష్ణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.


