ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్!
ఫరీదాబాద్ మాడ్యూల్ వెనుక మాస్టర్‌మైండ్ ఇమామ్ ఇర్ఫాన్ గుర్తింపు
జమ్మూకశ్మీర్ షోపియాన్ నుంచి ఉగ్ర నెట్‌వర్క్‌కు నేతృత్వం
మసీదు నుంచి మత మౌలికవాదం
కాకతీయ, జాతీయం : ఫరీదాబాద్‌లో ఇటీవల భద్రతా సిబ్బంది చేపట్టిన ఆపరేషన్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఈ ఆపరేషన్‌లో బయటపడిన ఉగ్రవాద కుట్రలు భద్రతా వ్యవస్థలను కుదిపేశాయి. ముఖ్యంగా వైద్యులుగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఉగ్ర మాడ్యూల్‌లో భాగమని తేలడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా సేవాస్పూర్తితో ఉండాల్సిన వైద్యులు, ఉగ్రవాద మార్గం వైపు ఎందుకు మళ్లారు? అనే ప్రశ్న దేశమంతా చర్చకు దారితీస్తోంది.
అయితే తాజాగా ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ గుట్టు రట్టు అయింది. ఈ ఉగ్ర మాడ్యూల్ వెనుక ఉన్న మాస్టర్‌మైండ్‌ను అధికారులు గుర్తించారు. అతని పేరు ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్. జమ్మూకశ్మీర్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో అతడి పాత్ర, సంబంధాలు, ప్రణాళికలు అన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇర్ఫాన్ జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతానికి చెందినవాడు. గతంలో శ్రీనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు. అదే సమయంలో విద్యార్థులతో సంబంధాలు పెంచుకుని, వారిని మత మౌలికవాదం వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు.
నౌగామ్‌లోని ఒక మసీదులో కలిసిన విద్యార్థులతో ఇర్ఫాన్ నిరంతరం సంబంధాలు కొనసాగించాడు. వారికి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు సంబంధించిన వీడియోలు చూపిస్తూ, ఆ భావజాలాన్ని వారిలో నాటాడు. అఫ్గానిస్థాన్‌లోని కొంతమంది వ్యక్తులతో కూడా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా కాంటాక్టులు కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. ఫరీదాబాద్‌లోని వైద్య కళాశాలలో ఇర్ఫాన్ చాతుర్యంగా పనిచేశాడు. విద్యార్థుల్లో మత మౌలికతను నాటుతూ, వారిని టెర్రర్ మార్గంలోకి తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యంగా వ్యవహరించినట్లు నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఈ మాడ్యూల్‌లో డాక్టర్ ముజమ్మిల్ మరియు ఉమర్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది.
నిఘా వర్గాల ప్రకారం, మొత్తం ఉగ్ర మాడ్యూల్‌ను ఇర్ఫాన్‌నే రూపకల్పన చేశాడు. ఈ నెట్‌వర్క్ బయటపడిన తర్వాత భయంతో ఉన్న ఉమర్ ఢిల్లీ పేలుడుకు కారణమైనట్లు సమాచారం. ఉమర్‌కి ఇర్ఫాన్‌తో నేరుగా సంబంధాలు ఉన్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. తాజాగా అరెస్టయిన డాక్టర్ షాహిన్, ఈ మాడ్యూల్‌కు ఆర్థిక మద్దతుదారుడిగా వ్యవహరించినట్లు సమాచారం. అతడే విదేశాల నుంచి వచ్చిన డబ్బును ఈ నెట్‌వర్క్ కార్యకలాపాలకు వినియోగించినట్లు నిఘా సంస్థలు వెల్లడించాయి. కాగా, ఇమామ్ ఇర్ఫాన్ అరెస్టుతో భద్రతా సంస్థలకు కీలక ఆధారాలు లభించాయి. అతడి నెట్‌వర్క్, సంబంధాలు, ఫండింగ్ మార్గాలు.. అన్నీ ఇప్పుడు విచారణలో భాగమవుతున్నాయి.


