గెలుపు ప్రలోబాలకు ఎర…
మరి కొద్దిగంటల్లో మూడో విడత పోలింగ్
కాకతీయ/జూలూరుపాడు : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పల్లెల్లో ప్రచార హడావుడి ముగిసింది. 48 గంటల ముందే మైకులు మూగబోగా.. అభ్యర్థులు క్షేత్రస్థాయిలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఫలితాలు వెలువడే వరకు మద్యం దుకాణాల మూసివేతకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో మందు పార్టీల సందడి కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పగలు మంతనాలు.. రాత్రి దావత్‌లు
పోలింగ్ సమయం దగ్గరపడటంతో అభ్యర్థులు పగటిపూట ముమ్మర మంతనాలు చేస్తూనే.. రాత్రివేళల్లో రహస్య సమావేశాలకు తెరలేపుతున్నారు. కుల సంఘాల నాయకులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నేతలతో భేటీలు కొనసాగిస్తున్నారు. తమకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తూ.. గెలిస్తే చేపట్టే అభివృద్ధి పనులపై హామీలు గుప్పిస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు సొంత నిధులతోనే అభివృద్ధి చేస్తామని చెప్పుకొస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బహిరంగ సమావేశాలకు నిషేధం ఉండటంతో రాత్రి వేళల్లో రహస్యంగా భేటీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఓటర్లకు దావత్‌లు, మద్యం పార్టీలు ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మద్యం దుకాణాలు బంద్
మండల పరిధిలో సోమవారం సాయంత్రం నుంచి ఈ నెల 17వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, ఇతర మద్యం విక్రయ కేంద్రాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ రెండు రోజుల పాటు సాధారణ మద్యం దుకాణాలతో పాటు ప్రత్యేక లైసెన్సులపై విక్రయాలు చేసే వారు కూడా మద్యం అమ్మకాలు, సర్వ్ చేయడం నిషేధమని స్పష్టం చేశారు.
ఓటర్ల ప్రలోభాలకు ప్లాన్
ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందురోజు రాత్రి, పోలింగ్ రోజు తెల్లవారుజామున మద్యం, నగదు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రహస్య ప్రాంతాల్లో డబ్బు, మద్యం నిల్వలు ఉంచినట్లు తెలుస్తోంది. ఏరియా ప్రాధాన్యతను బట్టి ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి గుట్టుచప్పుడు కాకుండా చేరవేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
అభ్యర్థులు, అనుచరుల వ్యూహాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తదితర పార్టీలు వ్యూహ–ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేసిన పార్టీలు.. పలు చోట్ల ఏకగ్రీవ స్థానాలను కూడా కైవసం చేసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తూనే అసంతృప్త ఓటర్లను దారికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. బలమైన అనుచరులతో కలిసి క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచిస్తూ మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి.


