ఏసీబీకి చిక్కిన ఇంజనీరింగ్ కన్సల్టెంట్
ఫైళ్ల ఆమోదం కోసం లంచం..
కాకతీయ, సిద్దిపేట : జిల్లాలోని మద్దూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న బండకింది పరుశురాములు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. మంగళవారం మధ్యాహ్నం ఫిర్యాదుదారుడి (ఎంజిఎన్ఆర్ ఈజిఎస్) పనుల ఫైళ్ల తనిఖీ, కొలత ధృవీకరణ, బిల్లులు పై అధికారులకు పంపడంలో సహకారం కోసం రూ.11,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వెంటనే ఏసీబీ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి, లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అవినీతికి పాల్పడిన పరుశు రాములను హైదరాబాద్ నాంపల్లిలోని ఎస్పిఈ అండ్ ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. కేసు దర్యాప్తులో కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అలాగే, ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినప్పుడు వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని కోరారు. అదేవిధంగా వాట్సాప్ యాప్ (9440446106), ఫేస్ బుక్ (తెలంగాణ ఏసీబీ ), ఎక్స్ (@తెలంగాణ ఏసీబీ) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. బాధితుల పేరు, వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు.


