మానవత్వం చాటుకున్న ఉద్యోగులు
పోస్టల్ ఉద్యోగికి తోటి సిబ్బంది అండ
రూ.30 వేల ఆర్థిక సాయం అందజేత
కాకతీయ, కామేపల్లి:విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేస్తూ అనుకోని ప్రమాదానికి గురైన తోటి ఉద్యోగికి పోస్టల్ శాఖ సిబ్బంది అండగా నిలిచారు. మానవత్వంతో స్పందించి ఆర్థిక సహాయం అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. మంగళ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారేపల్లి ఎస్.ఓ పరిధిలోని జోగ్గూడెం బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ బి. ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఖమ్మం ఈస్ట్ సబ్ డివిజన్, కారేపల్లి పోస్టల్ సిబ్బంది వెంటనే స్పందించి ఆర్థికంగా చేయూత అందించాలని నిర్ణయించారు.
కుటుంబానికి భరోసా
ప్రవీణ్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సిబ్బంది అందరూ కలిసి చందాలు సేకరించారు. ఈ మేరకు తక్షణ సాయంగా రూ.30,000 నగదును బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో తోటి ఉద్యోగులు చూపిన ఈ సహకారం కుటుంబానికి పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది. ఈ విపత్కర సమయంలో మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం అందించిన గ్రామీణ డాక్ సేవక్‌లు (జిడిఎస్), పోస్టల్ అసిస్టెంట్లు (పీఏ), సబ్ పోస్ట్‌మాస్టర్లు (ఎస్‌పీఎం), మెయిల్ ఓవర్సీర్లు (ఎంఓఎస్), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్ (ఐపీఓ), సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్స్ (ఎస్‌పీ) సహా అందరికీ ప్రవీణ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన ప్రవీణ్ త్వరగా కోలుకుని విధుల్లో చేరాలని సహచర ఉద్యోగులు ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న తోటి ఉద్యోగిని ఆదుకోవడంలో కారేపల్లి, ఖమ్మం ఈస్ట్ సబ్ డివిజన్ సిబ్బంది చూపిన ఈ ఐకమత్యం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు.


