ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి
జిల్లాలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
8 ఫ్లయింగ్ స్క్వాడ్, 4 స్టాటిక్ సర్వేలయన్స్ బృందాలు ఏర్పాటు
నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
కాకతీయ, కొత్తగూడెం : జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. గురువారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎన్నికల నిర్వహణపై పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతర శాఖలతో సమన్వయం పాటిస్తూ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జిల్లా పరిధిలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలలో ఈ నెల 11న పోలింగ్ జరగనుందని వెల్లడించారు. మొత్తం 101 పోలింగ్ స్థానాల్లో 288 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందులో 148 సాధారణ పోలింగ్ కేంద్రాలు, 125 సున్నితమైన కేంద్రాలు, 15 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు.
ఎన్నికల నిఘా చర్యల్లో భాగంగా 8 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 4 స్టాటిక్ సర్వేలయన్స్ బృందాలను నియమించామని చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఓటర్లను ప్రలోభపరిచే విధంగా నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.
ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, ఇల్లందు డీఎస్పీ వెంకన్నబాబు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, వివిధ సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు


