- జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం రూరల్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా ఎన్నికల నోడల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి(ఎంసీసీ) అమలు ఎన్నికల ప్రక్రియ నిర్వహణ వంటి అంశాలపై ఆయన అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రతీ అధికారి తన బాధ్యతను సమన్వయంతో నిర్వర్తించాలని సూచించారు. ఎంసీసీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, వాటి ఉల్లంఘనకు పాల్పడిన వారిపై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడంతో పాటు సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించి సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓలు) కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి అభ్యర్థులు తమ నామినేషన్ ఫారాలను ముందుగానే తనిఖీ చేసుకునే సౌకర్యం కల్పించాలని సూచించారు. రిటర్నింగ్ ఆఫీసర్లు స్వీకరించిన నామినేషన్లను అదే రోజు సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, ప్రతి రోజు సాయంత్రం నాటికి రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు.
తహసీల్దార్లు, నోడల్ అధికారులు బృందాల నివేదికలను సేకరించి జిల్లా నోడల్ అధికారులకు పంపాలని సూచించారు. జడ్పిటిసి నామినేషన్ల ప్రక్రియ సంబంధిత ఆర్డీవో, సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ర్యాలీలు, సమావేశాలు, లౌడ్ స్పీకర్ల వినియోగానికి సంబంధించి పోలీసుల నుండి అనుమతులు తప్పనిసరిగా పొందాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 9 ఉదయం 10.30 గంటల నుండి అక్టోబర్ 11సాయంత్రం 5.00 గంటల వరకు జరగనుంది. అక్టోబర్ 12న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13న అప్పీల్ స్వీకరణ, అక్టోబర్ 14న అప్పీల్ విచారణ జరగనున్నట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 వరకు ఉండగా అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య, తదితరులు పాల్గొన్నారు.


