రైలు ఢీకొని వృద్ధుడు మృతి
బోనకల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఘటన
కాకతీయ, బోనకల్ : రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఇరుగు నాగేశ్వరరావు (65) దుర్మరణం చెందిన ఘటన బోనకల్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఆర్ఓబీ వద్ద చోటుచేసుకుంది. గోవిందాపురం (ఎల్) గ్రామానికి చెందిన నాగేశ్వరరావు బోనకల్ నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం, ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రావడంతో పట్టాలపై ఆగిపోయిన నాగేశ్వరరావు, వెనుక నుంచి వస్తున్న మరో ఎక్స్ప్రెస్ రైలును గుర్తించలేకపోయాడు. వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఆయన శరీర భాగాలు 20 మీటర్ల దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనను చూసిన గ్రామ సర్పంచ్ మందా కరుణా, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. నాగేశ్వరరావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు.


