విద్యే భవిష్యత్‌కు పునాది
ప్రపంచ స్థాయి పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయాలి
గ్రామీణ సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు
సృజనాత్మకతకు వేదికగా ఇన్‌స్పైర్ : మంత్రి తుమ్మల
900 ఎగ్జిబిట్స్‌తో జిల్లా స్థాయి ప్రదర్శన
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మన విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీలకు సన్నద్ధం చేసేలా విద్యా బోధన ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరం బల్లేపల్లిలోని ఎస్.ఎఫ్.ఎస్. పాఠశాలలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ వైజ్ఞానిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆయన ప్రారంభించారు. జిల్లాస్థాయి ఎగ్జిబిషన్‌కు 900కు పైగా ప్రదర్శనలు రావడం విద్యార్థుల సృజనాత్మకతకు నిదర్శనమని ప్రశంసించారు.
సమస్యలకు శాస్త్రీయ ఆలోచనలు
గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలుగా చిన్న చిన్న యంత్రాలను విద్యార్థులు రూపొందించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులను సులభతరం చేసే ఆవిష్కరణలు సమాజానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థులలో ఆలోచనా శక్తిని పెంపొందించి మెరుగైన భవిష్యత్తుకు దారి చూపుతాయని తెలిపారు.
కలలు కని… సాధించాలి
దేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితాన్ని ఉదాహరణగా ప్రస్తావించిన మంత్రి, చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. అదే విధంగా విద్యార్థులు పెద్ద కలలు కని, వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్య లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని, పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యేనని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, ఇన్‌స్పైర్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్‌ను పెంచుతాయని అన్నారు. పాఠశాలలో నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజ సమస్యల పరిష్కారానికి ప్రాక్టికల్‌గా ఎలా ఉపయోగించాలో ఆలోచించాలని సూచించారు. విద్యా ప్రమాణాల పెంపుకు ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ అవసరమని, ప్రపంచ మార్పులకు అనుగుణంగా బోధనలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీఈవో చైతన్య జైని, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, కార్పొరేటర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


