ఇస్లాంపురం అంగన్వాడీలో ఈసీసీఈ డే
కాకతీయ, మిర్యాలగూడ : మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో సీడీపీఓ ఆదేశాల మేరకు ప్రతినెల నాలుగో శనివారం నిర్వహించే ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ECCE డే) కార్యక్రమాన్ని శనివారం ఇస్లాంపురం సెక్టర్ సుభాష్‌నగర్ అంగన్వాడి కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల్లో అందిస్తున్న విద్య ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందని, ఆటపాటలతో కూడిన బోధనను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందిస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ విధానంతో పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతో దోహదం జరుగుతుందన్నారు. పిల్లల ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధి కోసం తల్లిదండ్రులు అంగన్వాడి కేంద్రాల్లో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని, చిన్నారుల ఎదుగుదలలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని వారు సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ఎ.లత, సిహెచ్.నర్మద, ఎ.చిన్నమ్మ, హెల్పర్లు విజయలక్ష్మి, చంద్రకళ, మంగమ్మతో పాటు ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు, కిశోర బాలికలు, వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


