కాకతీయ, కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ లో శనివారం ప్రయాణికుల సందడి కనిపించింది. దసరా సందర్భంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో హాస్టల్ విద్యార్థులంతా ఇంటి బాట పట్టారు.
విద్యార్థులకు సంబంధించిన సామాగ్రిని తమ తల్లిదండ్రులు పట్టుకొని ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండుకు చేరుకోవడంతో బస్టాండ్ ప్రాంగణమంతా సందడి వాతావరణం ఏర్పడింది. అయితే సమయానికి బస్సులు దొరకక గంటల తరబడి తమ పిల్లలతో తల్లిదండ్రులు పడిగాపులు కాశారు. దసరా సెలవుల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు.


