ఊహాజనిత వార్తలు రాయొద్దు
మీడియా సెంటర్లో నిర్ధిష్టమైన సమాచారం ఇవ్వడానికి సిద్ధం
ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్‌లోని డీపీఆర్‌వో కార్యాలయంలో మీడియా సెంటర్‌ను అదనపు కలెక్టర్ డశ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఎన్నికల సజావు నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో పాత్రికేయులు తమ వంతు పాత్ర పోషించాలని, ఎతికల్ ఓటింగ్, ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించాలని, ఎన్నికలకు సంబంధించి సరైన సమాచారం ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. మీడియా సెంటర్ ద్వారా పాత్రికేయులకు అవసరమైన సరైన సమాచారం సకాలంలో అందించడం జరుగుతుందని, ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఊహాగానాలకు చెందిన వార్తలను వెరిఫై చేసుకోకుండా రాయవద్దని అదనపు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో వీడియోలు వినియోగించాలంటే ముందుగా మీడియా సెంటర్ లోని ఎంసిఎంసీ కమిటీని సంప్రదించి అనుమతి తీసుకోవాలని అన్నారు.
సమావేశంలో డిపిఆర్ఓ ఎం.ఏ. గౌస్, డిపిఓ ఆశాలత, అదనపు పిఆర్వో ఎండి. అయూబ్ ఖాన్, ఎంసిఎంసి కమిటీ సభ్యులు, కార్యాలయ టైపిస్ట్ ప్రవళిక, కంప్యూటర్ ఆపరేటర్లు నవీన్, హరీష్, సిబ్బంది చింతల శ్రీనివాస్ రావు, చావా నారాయణ, తాజుద్దీన్, మంగ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


